సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని చిన్ననెమిల వద్ద ఎన్ హెచ్ 365 ప్రధాన రహదారిపై బైక్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన బోయిని నాగయ్య.. సోమవారం రోజువారి కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో వరంగల్ జిల్లా చిల్లంచర్ల గ్రామానికి చెందిన అనంతుల అశోక్ ద్విచక్రవాహనంతో వెనుక నుంచి వచ్చి నాగయ్యను ఢీ కొట్టగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగయ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నాగయ్య మంగళవారం ఉదయం మృతిచెందాడు. తమ కళ్ల ముందు తిరుగుతూ.. చేతికి అందివచ్చిన తమ కుమారుడు హఠాత్తుగా మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుని తండ్రి రామచంద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.