కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో గల రామేశ్వరంపల్లి గ్రామ శివారులో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చెడు వ్యసనాలకు బానిసై, చిత్రహింసలు పెడుతున్నాడని భార్యే భర్తను హత్య చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభించింది. ఫలితంగా మృతుడు మాసుల సత్యనారాయణగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా మృతుని భార్య గౌతమిని పిలిపించి తమదైన శైలిలో విచారించారు. దాంతో చెడు వ్యసనాలకు బానిసై, తనను చిత్రహింసలు పెడుతుండటంతో తానే అంతమొందించినట్లు ఒప్పుకుంది. దిగంబర్, యశ్వంత్ అనే ఇద్దరితో రూ.15 వేలకు బేరం మాట్లాడుకుని.. సోమవారం రాత్రి అతడు పడుకున్న తర్వాత ముగ్గురూ కలిసి ముఖంపై తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు వివరించింది. అనంతరం శవాన్ని తీసుకెళ్లి రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన పారవేసినట్లు తెలిపిందని కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు.
బతుకుదెరువు కోసం వచ్చి..
సత్య నారాయణ, గౌతమిలకు ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరిది మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం పర్వతాపూర్ గ్రామం కాగా.. ఉపాధి కోసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు.