పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. మందమర్రికి చెందిన టెకం రాము, హుస్నాబాద్‌కు చెందిన రంజిత్‌లు ఈజీమనీకి అలవాటు పడి.. దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సీసీఎస్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రంజిత్, రాముని సోదాలు చేశారు. వారి వద్ద భారీ ఎత్తున ఆభరణాలు, నగదు లభించగా.. అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు పెద్దపల్లి అదనపు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. వీరిద్దరూ గతంలో కూడా దొంగతనం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్