పెళ్లి ఇంట్లో మాంసం సరిగా పెట్టలేదనే గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. మాంసం సరిపోలేదనే గొడవ ముదిరి గొడ్డలి దాడి దాకా వెళ్లింది. వివాహం జరుగుతున్న ఇంట్లో రక్తం చిందింది. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సూరారం ప్రవీణ్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై మోహన్ తెలిపారు.
ఇదీ వివాదం...
దాచారం గ్రామానికి చెందిన తాటిపాముల మహేశ్ వివాహం జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన యువతితో కుదిరింది. పెళ్లికూతురుని తీసుకువచ్చేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి వెళ్లారు. అక్కడ పెళ్లికూతురు సంబంధికులు మర్యాద సరిగా చేయలేదని, మాంసం సరిగా పెట్టలేదని దాచారానికి చెందిన సూరారం వెంకటయ్య అదే గ్రామానికి చెందిన కుల పెద్ద చంద్రయ్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవ బంధువుల చొరవతో సద్దుమణిగింది. దాచారం చేరుకున్న తర్వాత సూరారం వెంకటయ్య మళ్లీ విషయాన్ని లేవనెత్తడంతో వివాదం తలెత్తింది.
శృతిమించిన దాడి:
వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ ఆగ్రహంతో గొడ్డలితో చంద్రయ్య కుమారులు పరశురాములు, నాగరాజులపై దాడి చేశాడు. ఇరు వర్గాలవారు పరస్పరం కర్ర, గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సూరారం పరుశరాములుకు మెడపై, చెవి వద్ద గాయాలయ్యాయి. సూరారం నాగరాజుకు ఎడమ చేతిపై గాయం అయింది. ఇద్దరిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పరశురాములు మృతి చెందాడు. నాగరాజుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రవేటు ఆస్పత్రికి తరలించారు.
ఒకరు బలి
ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స పొందుతూ సూరారం పరుశరాములు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య