కరీంనగర్ పట్టణంలోని కాశ్మీర్ గడ్డకు చెందిన సకీనా దంపతులు తన చెల్లి్ కుటుంబంతో కలిసి అలుగునూర్లోని దర్గాను దర్శించుకున్నారు. అనంతరం సకీనా తన చెల్లెలి కుమారుడైన మూడేళ్ల ఆహిల్ను తీసుకుని పక్కనే ఉన్న దిగువ మానేరు జలాశయాన్ని తిలకించేందుకు వెళ్లింది. వరద నీటిని చూసేందుకు కరీంనగర్- సదాశివపల్లి తీగల వంతెన వద్దకు చేరుకుంది. వంతెన కింద ప్రవహిస్తున్న నీటిని చూస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆహిల్ వరద నీటిలో పడిపోయాడు. బాలుడిని కాపాడే ప్రయత్నంలో సకీనా సైతం వరద నీటిలో పడిపోయింది. వరదలో కొట్టుకుపోతున్న వారిని గమనించిన పర్యాటకులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు... నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించి.. వరద ప్రవాహాన్ని నిలిపి వేసి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిపాటి దూరంలో బాలుడు కొన ఊపిరితో లభించగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మరికొద్ది దూరంలో సకీనా మృతదేహం లభ్యమైంది.
ఉత్సాహంగా బయలుదేరిన కుటుంబంలో విషాదం మిగిలిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య