దృష్టిమరల్చి చోరీలకు పాల్పడుతున్న దొంగను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 33తులాల బంగారం, ఓ ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన అహ్మద్ బతుకుదెరువు కోసం 11ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చాడు. చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న అహ్మద్.. వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. చోరీలు చేసేందుకు గృహోపకరణాల విక్రయాన్ని ఎంచుకున్నాడు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో వాయిదా పద్ధతిపై గృహోపకరణాలు ఇస్తూ.. వ్యాపారం చేసేవాడు. బహుమతి వచ్చిందంటూ అమాయకులను నమ్మించి హైదరాబాద్‌లోని కార్యాలయానికి రమ్మనేవాడు.
ఒంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ధనికులుగా భావించి బహుమతులు ఇవ్వరని మాయమాటలు చెప్పి... వారి వద్ద ఉన్న ఆభరణాలు తీసుకొని ఉడాయించేవాడు. నిందితుడు అహ్మద్‌పై హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో 23 కేసులున్నాయి. మహారాష్ట్రలో అత్యాచారం కేసులో జైలుశిక్ష కూడా అనుభవించాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: సైబర్‌వల.. చిక్కావో విలవిల!