సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను సైతం మోసగాళ్లు వదలడం లేదు. ఎంపీ కే కేశవరావుకు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌గా మోసగాడు పరిచయం చేసుకున్నాడు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీంను కేంద్రం ప్రవేశపెట్టిందని, 25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల చొప్పున రుణం ఇస్తోందని వివరించాడు. ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. ఎంతోమంది ఎంపీలు పోటీపడుతున్నా... మంత్రి కేటీఆర్ సిఫారసుతో మీకే మంజూరు చేయించాలని భావిస్తున్నామని నమ్మబలికాడు. నిరుద్యోగుల పేర్లు పంపితే రుణాలిస్తామన్నాడు.
ఈ విషయాన్ని కేకే.. తన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి తెలిపారు. ఆమె.. మహేశ్‌కు ఫోన్ చేయగా దరఖాస్తుకు ఈ రోజు చివరితేదీ అని, ఒక్కొక్కరికీ రూ.1.25 లక్షల దాకా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని... డీడీ కడితే చాలు దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానన్నాడు. విజయలక్ష్మి తన డివిజన్లో కొంతమంది నిరుద్యోగులకు పథకం గురించి వివరించారు.
అప్పటికే మధ్యాహ్నం మూడు కావటం వల్ల డీడీ కట్టే సమయం అయిపోగా... డబ్బు తన అకౌంట్లో వేయాలని సూచించాడు. అప్పుడు అనుమానం వచ్చిన ఎంపీ కేకే.. మహేశ్ అనే వ్యక్తి కాల్ చేసి ఎక్కడున్నారని అడిగారు. తాను మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో ఉన్నట్టు సమాధానమిచ్చాడు. కేశవరావు నేరుగా కేటీఆర్‌కు ఫోన్ చేయగా.. ఆయన దిల్లీలో ఉన్నట్టు కేటీఆర్ పీఏ తెలిపాడు.
ఇది మోసమని గుర్తించిన కేకే... కుమార్తెను, ఇతరులను అప్రమత్తం చేశారు. అప్పటికే అఖిల్ అనే వ్యక్తి మోసగాడి ఖాతాలో రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. బాధితుడు అఖిల్‌తో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు అకౌంట్ వివరాలు సేకరించగా... నిజామాబాద్‌లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు.