కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంగళవారం ఉదయం చిన్నారి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. బుధవారం ఉదయం గ్రామసమీపంలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కుమార్తె సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటోంది. ఇంట్లో వంట చేస్తున్న తల్లి బయటకు వచ్చి చూసేసరికి చిన్న కూతురు కనిపించలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు.

తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్‌స్వ్కాడ్‌తో వెతికినప్పటికీ.. బాలిక జాడ దొరకలేదు. బుధవారం ఉదయం పొలాలవైపు వెళ్తున్న స్థానికులు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

సజీవంగా దొరుకుతుందని ఆతృతగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు... విగతజీవిగా మారిన కూతురును చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
