సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెద్దపంగు ప్రణయ్, నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్కు చెందిన లావణ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న ప్రణయ్, వెటర్నరీ డిప్లొమా చేసిన లావణ్య ఐదేళ్లుగా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గత జూన్ 12న వారికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న నగదును ఇచ్చిన లావణ్య తల్లిదండ్రులు.. ఇంకా రెండు తులాల బంగారం ఇవ్వాల్సి ఉంది.
అత్తగారి ఇంటి నుంచి రావాల్సిన బంగారం కోసం భర్త ప్రణయ్ వేధింపులకు గురిచేశాడని లావణ్య బంధువులు చెపుతున్నారు. బంగారం తేవాలని జనవరి 1న భార్య లావణ్యను అత్తగారింట్లో వదిలివెళ్లాడు. భర్త వైఖరితో వేదనకు గురైన లావణ్య కుటుంబసభ్యులు లేని సమయంలో శనివారం పురుగుల మందు సేవించి భర్తకు ఫోన్ చేసింది.
ఆ ప్రభావంతో చావుబతుకుల మధ్య ఉన్న ఆమె భర్తను నన్నెందుకు వదిలివెళ్లావంటూ అతనిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు సూర్యాపేట ఆసుపత్రికి ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె బంధువులు సూర్యాపేటలోని భర్త ఇంటి ముందు శవంతో ధర్నాకు దిగారు. కట్నం వేధింపులతోనే ఆమె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్య మరణం తట్టుకోలేని భర్త ప్రణయ్ ఆదివారం సాయంత్రం పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. తన భార్యంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆమె లేకుండా తానూ ఉండలేనని లేఖలో పేర్కొన్నాడు. తన భార్యను వేధించలేదని వెల్లడించాడు. అతని పరిస్థితి విషమంగా మారడంతో అతనిని హైదరాబాద్కు తరలించారు.
ఇదీ చూడండి : షార్ట్ సర్క్యూట్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు