నమ్మి ద్విచక్ర వాహనం ఎక్కిన మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్లోని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామకృష్ణ అలియాస్ రాము మూసాపేట యాదవ బస్తీలో నివసిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన తనకు పరిచయం ఉన్న అనసూయ అనే మహిళను ఆమె ఇంటి వద్ద విడిచిపెడతానంటూ బైక్ ఎక్కించుకున్నాడు.
ఖైత్లాపూర్ రాఘవేంద్ర సొసైటీ వద్ద గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆమె తలపై బండరాయితో మోదాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవటంతో, మృతి చెందినదని భావించి, బంగారం తీసుకుని పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు, ఆమె తల్లి వద్దకు చేరుకొని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య చేసానని భావించిన రాము అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. రామును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చూడండి: 'కొత్త ఏడాదిలో కొవిడ్ టీకాపై శుభవార్త'