ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కమతం రాంరెడ్డి మృతి చెందారు. ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొంది మంత్రిగా పని చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్‌కు చెందిన కమతం రాంరెడ్డి శనివారం మృతి చెంచారు. తెరాస సీనియర్ నేతగా ఉన్న రాంరెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 83 ఏళ్ల రాంరెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో భాజపాలో చేరారు. అప్పటి తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా పరిగి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా... మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018 ఎన్నికల సమయానికి భాజపా అతనిని సస్పెండ్ చేసింది.
2014లో ఎన్నికలు ముగిశాక కేసీఆర్ సమక్షంలో కమతం రాంరెడ్డి తెరాసలో చేరారు. కానీ వయోభారం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కమతం గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా.. వారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామంలో జరుగనున్నాయి.
ఇదీ చూడండి : గొర్రెల మందపై కుక్కల దాడి.. 200 మూగజీవాలు మృతి