రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని బీఎన్ఆర్ హిల్స్‌లో బోర్వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కి చెందిన నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నేపాల్‌కు చెందిన రాజేందర్ అలియాస్ రవి, అతని మేనకోడలు సీతతో పాటు మరొక ఇద్దరు కొంతకాలంగా మధుసూదన్ ఇంట్లో పని చేస్తున్నారు. 15 రోజుల క్రితం జానకి, మనోజ్ కొత్తగా పనిలోకి చేరారు. నమ్మకంగా పని చేస్తూనే... ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు. చోరీకి పథకం వేశారు. రాత్రి భోజనానికి వండిన పదార్థాల్లో మత్తుమందు కలిపారు. అవి తిన్న మధుసూదన్ రెడ్డి, అతని కుమారుడు నితీశ్ రెడ్డి, కోడలు దీప్తి, మనుమడు అయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మధూసూదన్ రెడ్డి భార్య రాత్రి చపాతి మాత్రమే తినటం వల్ల ఆమె సాధారణ నిద్రలోనే ఉన్నారు.
పథకం ప్రకారం ఇంట్లో ఉన్న 15 లక్షల నగదుతో పాటు, దీప్తి మెడలో ఉన్న బంగారు గొలుసును నేపాల్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఎలాంటి ఆధారం దొరకకుండా సీసీటీవీ కెమెరా డీవీఆర్‌ను, బాధితుల చరవాణులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేపాల్ ముఠా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రాయదుర్గం పోలీసులతో పాటు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బృందాలు ఏర్పడి నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.
నేపాల్ ముఠాన్ మదుసూదన్ రెడ్డి ఇంట్లో పనికి కుదిర్చిన లోకేశ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను కూడా పరారీలో ఉన్నాడు. లోకేశ్ నగరంలో ఎక్కడ బస చేశాడు. అతనికి తెలిసిన వ్యక్తులెవరనే వివరాలు సేకరిస్తున్నాడు. లోకేశ్ ను పట్టుకుంటే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు ఇంట్లో పనికి కుదిరి అదును చూసి చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నిందితులను ఎలాగైనా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిఘా పెట్టారు. శివారు ప్రాంతాల్లోని పోలీస్ స్టేష్లన్లను అప్రమత్తం చేశారు. నిందితులు మత్తుపదార్థం కలిపి ఇచ్చిన ఆహారం తీసుకున్న మధూసూధన్ రెడ్డి, ఆయన కుమారుడు నితీశ్ రెడ్డి కోలుకున్నారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఇద్దరిని కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆయన కోడలు దీపిక, మనవడు అయాన్ బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కూతురిపై కన్నేసిన మారు తండ్రి హతం