రాయదుర్గం పోలీస్టేషన్ పరిధి బీఎన్‌రెడ్డి హిల్స్‌లోని బోర్ వెల్ కాంట్రాక్టర్ గూడూరి మధుసూదన్ రెడ్డి ఇంట్లో నేపాల్ దొంగల చోరీ కేసు సంచలనం రేపింది. నమ్మకంగా పనిచేసి ఆహరంలో మత్తుమందు కలిపి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. ఇంట్లోని రూ.23 లక్షల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కంటే ముందే పది బృందాలను నేపాల్‌కు పంపి.. అక్కడ సరిహద్దులు వద్ద నిఘా పెట్టాయి. ఇదే క్రమంలో ఈనెల 11న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.17 వేల నగదు, 8.3 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రెండు ముఠాలుగా నగరంలోకి..
డిసెంబర్ 2019లో రాజేందర్ అలియాస్ రవి.. ఓ మధ్యవర్తి ద్వారా మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిలో చేరాడు. అనంతరం ఈ ఏడాది మార్చిలో జానకి అనే మహిళను పనిలో పెట్టించాడు. చోరీకి 20 రోజుల ముందు రాజేందర్ బంధువు సీత, మనోజ్‌లు పనిలో చేరారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన జానకి ఇంట్లోని ప్రతి అడుగు గమనించింది. ఆ సమాచారంతో పాటు పరిసర ప్రాంతాల వివరాలను రాజేందర్.. నేపాల్‌లో ఉన్న ప్రధాన నిందితుడు నేత్ర బహదూర్ షాహికు అందించాడు. అనంతరం నేపాల్ నుంచి రెండు ముఠాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. నేత్రతో పాటు వినోద్, ప్రకాశ్ ఒక బృందంగా.. జానకి ప్రియుడు దేవిరాం దామ్లా, చక్ర బౌల్లు మరొక బృందంగా వచ్చారు.
యూపీ నుంచి మత్తు మందులు..
నేపాల్ నుంచి వస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న తన సహచరుడు అఖిలేష్ కుమార్ వద్ద నుంచి సుమారు 120 మత్తు మందులు తెచ్చాడు. నాలుగు రోజుల నుంచి మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన నేత్ర.. అనంతరం ఇంట్లో ఉన్న జానకి, రాజేందర్, సీత, మనోజ్‌లకు పథకం వివరించాడు. ఈనెల 5న రాత్రి చోరీకి ముహూర్తం పెట్టారు.
చోరీ ఎలా చేశారంటే..
చోరికి ముందు రోజు సాయంత్రం.. రాజేందర్‌ను బయటకు పిలిచిన నేత్ర.. మత్తు మందుల పొడిని ఇచ్చాడు. దానికి జానకికి ఇవ్వాల్సిందిగా సూచించాడు. 5 మధ్యాహ్నం.. నేత్ర, ప్రకాష్‌లు అక్కడికి చేరుకున్నారు. రాజేందర్‌తో మద్యం తెప్పించుకుని తాగారు. సాయంత్రం 7 గంటల సమయంలో మరో ముగ్గురు ఇంటి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో వేచి ఉన్నారు. వంటమనిషి జానకి పథకం ప్రకారం.. ఆ రాత్రి యజమానుల కోసం వండిన మిల్మేకర్ కూర, పాలు, గ్రీన్‌టీలో మత్తుమందుల పొడిని కలిపింది. ఇంట్లో ఉన్న మధుసూదన్, అతని కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి చపాతి, కూర తిన్నారు. మనుమడు ఆయాన్‌కు మత్తుమందు కలిపిన పాలని తెలియక.. తల్లి దీప్తి తాగించింది. మధుసూదన్ భార్య శైలజ మాత్రం గ్రీన్‌టీ తాగింది. చేదుగా ఉండటంలో పక్కన పెట్టింది. కారు డ్రైవర్ శ్రీనివాస్ చోరీకి అడ్డు వస్తాడని భావించిన ముఠా.. సీత పుట్టిన రోజు అని చెప్పి మత్తు మందు కలిపిన స్వీట్‌ను అతనికి ఇచ్చింది.
మత్తు మందు కలిపిన ఆహారం తిన్నాక ఏమైంది..
మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు, డ్రైవర్ రాత్రి 11 గంటల వరకూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో రాజేందర్, జానకి.. నేత్రకి సమాచారం అందించారు. అతను.. బయట ఉన్న ప్రకాష్‌తో పాటు మరో మగ్గురిని లోపలికి పంపాడు. అలికిడి రావడంతో మధుసూదన్ భార్య శైలజ నిద్ర లేచింది. అప్రమత్తమైన.. సీత, మనోజ్‌లు కలిసి ఆమెపై దాడి చేసి తాళ్లతో కట్టేశారు. జానకి, మనోజ్‌లు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ముఠా సభ్యులు.. మధుసూదన్ గదిలోని రూ.15 లక్షల నగదు కాజేశారు.
అంతా అయ్యాక చెరో దారి..
నితీష్ రెడ్డి, దీప్తి గదిలోని లాకర్‌ను తీసుకున్నారు. సర్వెంట్ రూమ్‌లోకి తీసుకొచ్చి లాకర్‌ను పగల కొట్టారు. బంగారు గొలుసుతో పాటు మరో రూ.9 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం బయట పరిస్థతిని చూసి అక్కడి నుంచి బృందాలుగా విడిపోయారు. జానకి, నేత్ర ఒక ఆటోలో.. మనోజ్, చక్ర బౌల్ అలియాస్ రితోష్, వినోద్ కలిసి క్యాబ్‌లో ఎల్బీనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి తలో దారిలో నేపాల్‌కు బయలుదేరారు. ఇంట్లోని సీసీటీవీ డీవీఆర్‌తో పాటు, యజమానుల చరవాణులను తన బ్యాగులో వేసుకుని వెళ్లిపోయాడు నిందితుల్లో ఒకడైన రాజేందర్. మిగిలిన వారు సాధారణ వ్యక్తుల్లా నడుచుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
నిందితుల కంటే ముందే..
తెల్లవారుజామున వాచ్మెన్ సాయంతో శైలజ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ టీమ్‌లు పది బృందాలుగా విడిపోయి.. నిందితుల కంటే ముందే పలు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకున్నాయి. ప్రధాన నిందితుడు నేత్ర, ప్రకాష్, సీతలను ఈనెల 11న ఉత్తర ప్రదేశ్, నేపాల్ సరిహద్దుల వద్ద పట్టుకున్నారు. పరిస్థితి గమనించేందుకు జానకి, చక్రబౌల్ అలియాస్ రితోష్లు నగరంలోనే ఉండిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు యత్నించగా.. విశ్వసనీయ సమాచారంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో మత్తుమందులు సరఫరా చేసిన అఖిలేష్కుమార్ను అరెస్ట్ చేశారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ కేసులు మరో నలుగురు నిందితులు రాజేందర్, వినోద్, మనోజ్, దేవిరాం కోసం మూడు బృందాలు ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నేపాల్ సరిహద్దుల్లో గాలిస్తున్నాయని మాదాపూర్ ఇంఛార్జి డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నేపాల్‌కు చెందిన వారిని పనివాళ్లుగా పెట్టుకునేటప్పుడు జాగ్రతలు వహించాలని.. వారి వివరాలను స్థానిక పోలీసులకు ఇస్తే తనిఖీ చేసి ఇస్తామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. పనివాళ్లను ఇళ్లలోని అన్ని గదుల్లోకి రానివొద్దని.. తాళాలు చేతికి ఇవ్వొద్దని హెచ్చరించారు.