వికారాబాద్ జిల్లా బషీర్‌బాద్ మండలం ఎక్మయి గ్రామానికి చెందిన రైతు పోషమల్ల మొగలప్ప తనకున్న 5 ఎకరాల పొలంలో కంది, పత్తి పంటలు సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పంటల కోసం సుమారు రూ.3 లక్షల అప్పు చేశానని.. తనను ఆదుకోవాలని బషీర్‌బాద్ మండల తహసీల్దార్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. నిధులు లేవంటూ ఎమ్మార్వో పట్టించుకోకపోవడం వల్ల శాసనసభలో మంత్రులను కలిసి తన బాధను చెప్పుకుందామని వచ్చాడు. అక్కడి భద్రతా సిబ్బందిని చూసి వెనుదిరిగాడు. అనంతరం గన్‌పార్క్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. కానిస్టేబుల్ అడ్డుకోవడం వల్ల ప్రమాదం తప్పింది.
హైదరాబాద్‌లో మంత్రులు లేదా ఉన్నతాధికారులను కలిసి తన ఇబ్బందులు వివరించాలని వస్తే.. ఆ ప్రయత్నమూ ఫలించకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నట్లు రైతు మొగలప్ప వివరించారు. భారీ వర్షాలకు పంటలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. మొగలప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.