ఆర్థిక ఇబ్బందులతో రైతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం సూరేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సామా కాంతరెడ్డి తనకున్న పది ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సన్నరకం, దొడ్డు రకం సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట బాగా దెబ్బతింది. రెండు మోటార్లు నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. పంట దిగుబడి బాగా తగ్గింది. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం వల్ల ఏంచేయాలో తెలియక.. తన స్థితిని గ్రామస్థులతో పంచుకున్నాడు.
20 రోజుల క్రితం.. తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. కేసీఆర్కు వీడియో తీసి పంపాడు. అయినా అధికారుల నుంచి స్పందన లేదు. బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి నుంచి ఇంటికి వచ్చాడు. స్నానం కోసం వెళ్లిన వాడు ఎంతకీ బయటకురాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు భయాందోళకు గురయ్యారు. ఇరుగు పొరుగువారి సాయంతో స్నానాల గది తలుపులు తెరిచారు. అప్పటికే కాంతరెడ్డి అపస్మారక స్థితిలో పడిఉండడాన్ని గుర్తుంచారు. పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాంతరెడ్డి మృతిచెందారు. మృతుడి భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పంట నష్టం, ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం లేకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇవీచూడండి: కల నెరవేరలేదని తనువు చాలించాడు...