బిర్యానీ కావాలంటే హోటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. పిల్లలకు బొమ్మలు కావాలంటే షాపింగ్‌మాల్ అవసరం లేదు.. చరవాణిలో అప్లికేషన్ (మొబైల్ యాప్) ఉంటే చాలు. బిర్యానీ, బొమ్మలు, కూరగాయలు, వంట సామగ్రి.. ఇలా అనేక అవసరాలను యాప్‌లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే ఉచితంగా లభించే కొన్ని మొబైల్ అప్లికేషన్‌లతో సౌకర్యంతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉచితమని యాప్‌లను మీ చరవాణి, ట్యాబ్, కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని మొబైల్ యాప్‌లు ప్రమాదకరమని కొద్ది నెలల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మరోవైపు ఉచిత యాప్‌ల పేరుతో సైబర్ నేరస్థులు చరవాణుల యజమానుల వ్యక్తిగత రహస్యాలను సేకరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాలంలో ఉన్న 4.5 కోట్ల మొబైల్ యాప్‌ల్లో నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు.
వ్యక్తిగత రహస్యాలన్నీ గుప్పిట్లో...
సైబర్ నేరస్థులు ఉచిత మొబైల్ అప్లికేషన్లను చరవాణుల వినియోగదారులకు, విద్యార్థులకు, సంస్థలకు ఎరగా వేస్తున్నారు. వారు డౌన్‌లోడ్ చేసుకోగానే.. చరవాణులు, ట్యాబ్‌లు, కంప్యూటర్లతో చొరబడుతున్నారు. మొబైల్ అప్లికేషన్‌ను క్లిక్ చేయగానే.. ఆయా సంస్థలు, వ్యక్తుల డేటాను చోరీ చేస్తున్నారు. ఇలా చోరీ చేశాక ఆయా కంపెనీల ప్రత్యర్థి కంపెనీలకు డేటాను విక్రయస్తామంటూ బెదిరిస్తున్నారు. వారు డిమాండ్ చేసిన సొమ్మును ఇచ్చాకే మాల్‌వేర్, రాన్సమ్ వేర్‌లను తొలగిస్తున్నారు. కొద్దినెలల క్రితం వరకూ దిల్లీ, బెంగళూరు, చెన్నైలకే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇటీవల హైదరాబాద్‌లోనూ పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ప్రమాదం కొని తెచ్చుకోవడమే..
ఉచితంగా వచ్చే మొబైల్ అప్లికేషన్లను వినియోగించడమంటే కోరి ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. వీటిలో చాలా ప్రాచుర్యం పొందిన మొబైల్ అప్లికేషన్లతో పాటు నిత్యం మనం ఉపయోగించేవీ ఉన్నాయి. ఇటీవల కేంద్ర నిఘా విభాగం కొన్ని వందల మొబైల్ అప్లికేషన్లను విశ్లేషించగా.. ఎక్కువగా చైనా తయారీ మొబైల్ ఫోన్లు, అప్లికేషన్‌లను ఈ నేరాలకు వినియోగిస్తున్నట్లు తేలింది. వీటిల్లో 90 శాతం నేరపూరితమైనవే. నేరస్థులు బాధితుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల వీడియోలను వారి ముఖాలతో మార్చి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోలీసులకు చెబితే పరువు పోతుందన్న భావనతో బాధితుల్లో చాలామంది ఫిర్యాదులు చేయడం లేదు.
అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్ల చరిత్రను పరిశీలించాకే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ అప్లికేషన్‌లకు అనుబంధంగా నైజీరియన్లు, సైబర్ నేరగాళ్లు ప్రమాదకరమైన లింకులను పంపుతున్నారు. వాటిపై క్లిక్ చేయగానే... పేరు, చరవాణి నంబరు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలన్నీ వారికి తెలిసిపోతున్నాయి. వెంటనే ఆ వివరాలను తీసుకుని డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇలా మోసగాళ్ల బారిన పడినవారు ఫిర్యాదులు చేస్తున్నారు. మాల్‌వేర్ వైరస్‌లను గుర్తించడం అంత సులువు కాదు. అందుకే అచితూచి మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్ క్రైమ్స్
ఇదీ చదవండి : అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!