చంచల్గూడ మహిళా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఈఎస్ఐ సంయుక్త సంచాలకురాలు పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. తన వద్ద ఉన్న మాత్రలను ఎక్కువగా వేసుకొని బలవన్మరణానికి యత్నించారు. తోటి ఖైదీల ద్వారా విషయాన్ని తెలుసుకున్న జైలు అధికారులు ఆమెకు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని జైలు అధికారులు తెలిపారు.
పద్మ కుటుంబ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం జైలుకు వచ్చి కలిసి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె బాధతో కుంగిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురవడం వల్ల చంచల్గూడ జైలు వైద్యులు ఆమెకు మాత్రలు ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆమె తన వద్ద ఉన్న మాత్రలు ఒకేసారి మింగినట్లు జైలు అధికారులు గుర్తించారు.
ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో పద్మ నిందితురాలిగా ఉన్నారు. గత నెల 27 న పద్మను అరెస్ట్ చేసిన అనిశా అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో అనిశా అధికారులు ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేశారు.