సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి అపహరణ కేసులో భూమా అఖిల ప్రియను వరుసగా రెండో రోజు పోలీసులు ప్రశ్నించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆమె న్యాయవాది సమక్షంలో విచారించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఎక్కడున్నారు.. పథకం రచించింది ఎవరు.. ఇతర కుటుంబ సభ్యుల పాత్రపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.
తనకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు..
అఖిల ప్రియ మాత్రం తనకు ఏమీ తెలియదని, ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కిడ్నాపర్ల నుంచి అఖిలప్రియకు వచ్చిన ఫోన్లపై దర్యాప్తు అధికారులు ఆరాతీయగా.. రాజకీయ నేతగా ఉన్న తనకు రోజూ ఎంతో మంది ఫోన్ చేస్తుంటారని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తర మండలం డీసీపీ కలమేశ్వర్ ఆధ్వర్యంలో ఆమెను విచారించారు.
జగత్ విఖ్యాత్‌రెడ్డి పాత్రపైనా..
అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అపహరణ జరిగిన సమయంలో అసలు ఆయన ఎక్కడున్నారు.. అని ఆరాతీస్తున్నారు. అపహరణ సమయంలో ఆయన చరవాణి సిగ్నల్స్నూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కిడ్నాప్ కేసులో మరికొంత మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం.. మరోసారి అఖిలప్రియను పోలీసులు విచారించనున్నారు.
ఇవీచూడండి: కిడ్నాప్ ప్లాన్ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?