ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మానసిక ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ నమోదు చేశారు. వాంగ్మూలంలోని వివరాలివి... ‘నర్సీపట్నం ఆర్డీవో మా ఏరియా ఆసుపత్రికి వచ్చినప్పుడు మాస్కులు కావాలని కోరా. కరోనా బాధితులకు చికిత్స అందించడం లేదు కాబట్టి.. అనస్తీషియా వైద్యుడికి మాస్కుల అవసరం లేదని ఆయన బదులిచ్చారు. ఏప్రిల్ 6న ఒక రోగికి చికిత్సనందించేందుకు ఎన్95 మాస్కులు కావాలని కోరగా ఫార్మాసిస్టు ఒకటి ఇస్తూ 15 రోజులపాటు వాడుకోవాలని సూచించారు. మాస్కులు లేనట్లయితే ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పడే ఇబ్బందులపై సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి వీడియోను ఆసుపత్రి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే గణేశ్‌కు చూపుదామని ఆయన ఇంటికెళ్లా. పురపాలక కార్యాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి వేచిచూశా. స్పందన లేదు. ఆసుపత్రి సలహా కమిటీ పూర్వ ఛైర్మన్ సీహెచ్ అయ్యన్నపాత్రుడి వద్దకు వెళ్లినప్పటికీ కలుసుకోలేకపోయా. పురపాలక కార్యాలయానికి తిరిగివచ్చి ఎన్ 95 మాస్కుతో ఉన్న ఆర్డీవోను కలిశా. నర్సీపట్నం ఎమ్మెల్యే, అదనపు ఎస్పీ, సీఐ ఎన్95 మాస్కులు ధరించి ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి ఎన్95 మాస్కులు కావాలన్నందుకు వారు దుర్భాషలాడారు. విషయం మీడియాలో వచ్చాక నాకు, కుటుంబసభ్యులకు కూడా అపరిచితులు ఫోన్ చేసి దూషించారు. ఏప్రిల్ 8న ఉదయం అంబులెన్సు డ్రైవర్ రాము వచ్చి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నా'.
వాహనం కోసం వెళితే చేయి చేసుకున్నారు
దాదాపు 13 రోజుల కిందట ఇద్దరు గుర్తు తెలియనివారు నా కుమారుడి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఆ వెంటనే మూడు రోజులకు 4వ పట్టణ పోలీసుస్టేషన్‌కు నేను వెళ్లా. ఓ మహిళా కానిస్టేబుల్ నా చేయి పట్టుకుంది. వదిలిపెట్టాలని ఏడ్చింది. నాపై పోలీసులు చేయి చేసుకున్నారు. తప్పుడు కేసు పెట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయిస్తామని బెదిరించారు. మే 16న సొంత పనులపై అనకాపల్లికి బయలుదేరా. ద్విచక్రవాహనంపై ఎవరో అనుసరిస్తున్నట్లు అర్థమై వెనక్కు మళ్లా. మూత్రవిసర్జన కోసం పోర్టు ఆసుపత్రి వద్ద కారు నిలిపా. నన్ను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చి నా సస్పెన్షన్, ఇతర అంశాలపై ప్రశ్నించారు. సెల్‌ఫోన్, ఏటీఎం కార్డులున్న పర్సుతో పాటు కారు తాళాలు తీసుకున్నారు. నన్ను అర్ధనగ్నం చేశారు. చేతులు, బూట్లు, లాఠీలతో కొట్టారు. నా వద్దనున్న రూ.10 లక్షలు తీసుకున్నారని, కారు ముందు సీట్లో 3 విస్కీ సీˆసాలు పెట్టారని తెలిసింది. పిచ్చివాడినని, మద్యం సేవించి ఉన్నానని సృష్టించేందుకు యత్నించారు. నన్ను 4వ పట్టణ ఠాణాకు తీసుకెళ్లారు. చేతులను వెనక్కి కట్టి 2గంటల పాటు గచ్చుపై పడేశారు’ అని పేర్కొన్నారు.
మెజిస్ట్రేట్ నమోదు చేసిన గాయాలిలా..
- ఎడమ కన్ను దిగువన కమిలిన గాయం
- ఎడమకాలు బొటనవేలు కమలడం
- ఎడమ చేయి మధ్య వేలు, చూపుడు వేలు మధ్యలో గాయం
- కుడి తొడ వెనక సుమారు అరచేయంత మందంలో కమలిన గుర్తులు
- ఎడమ ముంజేయిపై కమలడం
- కుడి ముంజేయిపై గోటితో గిచ్చిన ఆనవాళ్లు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం