నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు అనిశా న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. కోటి 12 లక్షలు లంచం తీసుకున్న కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ అరుణ, సత్తార్, వసీం, జీవన్ గౌడ్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి బాధితుడు లింగమూర్తి నుంచి మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ కోటి 12 లక్షలు లంచం తీసుకున్నాడు.
ఇదే కేసులో ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్ చెరో లక్ష రూపాయలు, జూనియర్ అసిస్టెంట్ వసీం మూడు లక్షలను లంచంగా తీసుకున్నారు. బాధితుడు ఆధారాలతో సహా అవినీతి నిరోధక శాఖాధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదుగురు నిందితులను నాలుగు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
కస్టడీ ముగియడం వల్ల న్యాయస్థానంలో హాజరుపర్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. దర్యాప్తు ముగిసినందున బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లంచం కేసులో ఇంకా పలు సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని... నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని అనిశా తరపు న్యాయవాది వాదించారు. ఆ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్‌ను నిరాకరించింది.
ఇదీ చూడండి : ఆట మిగిల్చిన విషాదం: చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి