ప్రభుత్వాలు ఎన్ని మారినా... అన్నదాతల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన రైతుల కష్టాలు తీరడం లేదు. నిత్యం ఎక్కడో ఒకరు అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తెల్కపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామానికి చెందిన నూనె రేణయ్య... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రేణయ్య తనకు ఉన్న ఐదు ఎకరాల పొలం, మరో ఆరు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేసి తనకున్న వ్యవసాయ పొలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పండించారు. అకాల వర్షాలతో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు విపరీతంగా పెరిగి చేసిన అప్పులు తీర్చలేకపోవడం వల్ల మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు సేవించారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న రేణయ్యను నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పరిస్థితి విషమించగా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువరైతు చనిపోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: జోరుమీదున్న భాజపా.. సత్తా చాటేందుకు వ్యూహాలు