రుణం ఇస్తామంటూ ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన పోస్టును నమ్మి లక్షకు పైగా సమర్పించుకున్నాడు ఓ అమాయకుడు. హైదరాబాద్‌లోని మాదన్నపేట్‌కు చెందిన గిరిప్రసాద్... ఫేస్బుక్లో ఉన్న ఫోన్ నంబర్‌కు సైబర్ నేరగాళ్లు కాల్ చేసి... తాము రూ.3 లక్షలు రుణం ఇస్తామంటూ బాధితున్ని నమ్మించారు.
ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ పది వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, జీఎస్టీ అంటూ పలు రకాలైన ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. చెల్లించే ఈ డబ్బులన్నీ రుణంతో పాటే వచ్చేస్తాయంటూ నమ్మించడం వల్ల బాధితుడు మొత్తంగా లక్షా 14 వేల నగదు డిపాజిట్ చేశాడు. అనంతరం అటునుంచి ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల మోసపోయానని గ్రహించాడు.
వెంటనే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మేందుకు ప్రయత్నించిన పంజాగుట్టకు చెందిన ఓ మహిళ నుంచి రూ.65 వేలను సైబర్ నేరగాళ్లు నొక్కేశారు.