ఆన్లైన్ గేమింగ్ ద్వారా హవాలా మార్గంలో నల్లధనం పంపించేందుకు ఏడాదిన్నర క్రితం పక్కా ప్రణాళికతో చైనీయులు దిల్లీకి వచ్చారు. డోకీ పే, లింక్ యున్ సంస్థలతో పాటు అనుబంధంగా 30 ఈ - కామర్స్ కంపెనీలను ప్రారంభించి టెలిగ్రామ్, మెసెంజర్ ద్వారా బృందాలు ఏర్పాటు చేశారు. కలర్ ప్రిడిక్షన్ పేరుతో రంగులాట ఆడించి అమాయక యువత నుంచి డబ్బు దోచేశారు.
మోసపోయాం
చైనా కంపెనీలు తమను మోసం చేశాయంటూ మూణ్నెళ్ల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మదన్.. దర్యాప్తు చేపట్టగా.. చైనా సంస్థల తెరవెనుక బాగోతం బయటపడింది. ఈ కేసులో చైనీయుడు యాహువో సహా అంకిత్, ధీరజ్, నీరజ్లను అరెస్ట్ చేశారు. నిందితులను హైదరాబాద్కు తరలించారు. కోర్టు అనుమతితో విచారించగా .. రూ. 1,100 కోట్ల నల్లధనాన్ని తరలించినట్లు గుర్తించారు.
రూ.1500కోట్లు
దిల్లీలోని బ్యాంకులు, ఆర్థిక సేవలందించే సంస్థలను సంప్రదించగా .. మరో రూ.400 కోట్ల లావాదేవీలు బయటపడ్డాయి. మొత్తం రూ.1,500 కోట్లు అక్రమంగా తరలించారని, యానాహువో సహా ఆరుగురు చైనీయులు, 18 మంది భారతీయులను నిందితులుగా తేల్చి కోర్టుకు నివేదిక సమర్పించారు.
రంగు చెప్పు.. డబ్బు గెలుచుకో
రంగులు చెప్పండి .. రూ.లక్షలు గెలుచుకోండి అంటూ మాయాజాలం ప్రదర్శించి వందల కోట్లు పోగేసుకున్న చైనా సంస్థలు, కంపెనీలు నల్లధనంతో పాటు దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలేమైనా చేస్తున్నారా... అన్న కోణంలో పరిశోధిస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న 32 చైనా సంస్థలు, కంపెనీలు లావాదేవీల కోసం 30 లక్షల ఖాతాలు నిర్వహస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 25 లక్షల మంది ఫొటోలు, చరవాణులు, ఈ - మెయిల్ చిరునామాలను సేకరించినట్లు కోర్టుకు నివేదించారు. ఈ వివరాల ద్వారా వారు ఏం చేస్తున్నారన్నది పరోక్షంగా గమనించే అవకాశాలున్నాయని చెప్పారు.
సమాంతర దర్యాప్తు
ఆన్లైన్ గేమింగ్ అక్రమాలపై ఐటీ, ఈడీలకు సమాచారం అందించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారితో కలిసి చైనా కంపెనీలపై సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.