పాత నేరస్థుడి దారుణ హత్య కేసును హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి 11.30 గంటలకు ఆజాంపురా రైల్వే ట్రాక్ పక్కన సయ్యద్ సాజిద్ అలియాస్ చాచా దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సెల్ఫోన్, జేబు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని ఏసీపీ దేవేందర్ తెలిపారు. ఇతని హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. పాతకక్షల కారణంగానే ఆరుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు.
కారు సీటు తయారీదారుగా పనిచేసే చంచల్గూడాకు చెందిన అబ్దుల్ ఖాదర్ను చాచా బెదిరించగా.. ఇరువురి మధ్య కక్షలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు మిత్రులతో కలిసి ఆజాంపురాలోని ఎంసీహెచ్ గ్రౌండ్ వద్ద చాచాను కత్తులతో పొడిచి చంపేశారు. ఈ హత్య కేసును 24 గంటల్లో ఛేదించి.. నిందితులను పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిందితులు గంజాయి, వైట్నర్ మత్తుకు బానిసలై గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది