జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో బండి సంజయ్‌ని సత్కరించి స్వామి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని బండి సంజయ్ అన్నారు. మహిమాన్వితమైన శక్తిపీఠం చాలా రోజుల నుంచి దర్శించుకోవాలని అనుకుంటున్నా ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ప్రజలు మన తెలంగాణలో ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ తల్లిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు దర్శనానికి వస్తుంటారని.. కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. నేనే స్వచ్ఛమైన హిందువుని.. నేనూ యాగాలు, హోమాలు చేస్తానని చెప్పుకుని తిరిగే ముఖ్యమంత్రికి తుంగభద్ర నది పుష్కరాలు ఉన్నాయని గుర్తుందా అని ప్రశ్నించారు.
పుష్కరాలపై సమీక్ష చేశారా అని అడిగారు. పుష్కరాలు నిర్వహించే అవకాశం లేకుంటే స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దాతలు ఎవరైనా వచ్చి చేసుకుంటారని చెప్పారు. స్వార్థం కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడు, కుమార్తెకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది: కిషన్‌రెడ్డి