దత్తత తీసుకున్న బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురంలో చోటు చేసుకుంది. మండలంలోని సూరవీడు గ్రామానికి చెందిన నాగేశ్వరి ఓ యువతి వద్ద చట్టబద్ధంగా బాలుడిని దత్తత తీసుకుంది. యువతి గర్భిణీగా ఉన్నప్పటి నుంచి ఆమె బిడ్డకు జన్మనిచ్చే వరకు సపర్యలు చేసి.. అనంతరం బాబుని దత్తత తీసుకున్నట్లు నాగేశ్వరి పేర్కొంది.
నాలుగు నెలల నుంచి బాబు నాగేశ్వరి వద్దనే ఉంటున్నాడని... ఎలాంటి గొడవలు సైతం లేవని వెల్లడించింది. గురువారం రాత్రి కొందరు మాస్కులు ధరించి... కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి నిద్రిస్తున్న బాలుడిని అపహరించుకుపోయారని బాధిత మహిళ పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు... దుండగుల వాహనం ఏటూరునాగారం మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. బాలుడితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నామని... వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ శివ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: వారి దురాశ.. కుటుంబసభ్యులకు కన్నీటి గోస..