ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అధికారులు అనిశా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం నర్సింహారెడ్డికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. అక్కడి నుంచి ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇప్పటి వరకూ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 70 కోట్ల అక్రమాస్తులను అనిశా గుర్తించింది. ఆయన ఇంట్లో లభించిన బ్యాంకు లాకర్ కీలకు సంబంధించి వివరాలు తేలాల్సి ఉంది. దీంతో పాటు సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని నివాసంలో దొరికిన ఆస్తుల డాక్యుమెంట్లకు సంబంధించి అతని స్నేహితులు, బంధువులు, బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో లభ్యమైన ప్రామిసరీ నోట్లపై అనిశా అధికారులు ఆరా తీశారు. వడ్డీ వ్యాపారం చేసినట్లుగా గుర్తించారు. ఇంట్లో దొరికిన 15 లక్షల నగదుతో పాటు మరి కొంత నగదు వడ్డీలకు ఇచ్చినట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: అనిశాకు చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి