తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. మధుసూదన్‌రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అనిశా తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో మొత్తంగా 10 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. మధుసూదన్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.24 లక్షల విలువైన ఫ్లాట్‌ను రూ.8 లక్షలకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. రూ.1.81 కోట్లకు కొన్న ఇంటిని రూ.91 లక్షలకే కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మధుసూదన్‌రెడ్డి బంధువుల వద్ద 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ దాడులపై మధుసూదన్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... బినామీలు ఎవరూ లేరని అన్నారు. మహేందర్ రెడ్డి ఎవ్వరో తనకు తెలియదని... రూ.50 లక్షలు దొరికాయని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తన ఇంట్లో రూ.1.30 లక్షలు మాత్రమే ఏసీబీ అధికారులకు దొరికాయని వెల్లడించారు. అనిశా దాడులు ఎందుకు జరుగుతున్నాయో తర్వాత చెబుతానన్నారు. తనపై వస్తున్న అభియోగాలు రుజువు చేస్తే అరెస్ట్‌కు సిద్ధమని స్పష్టం చేశారు.