నాగర్ కర్నూలు జిల్లాలో ఆస్తి తగాదాలతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన దగ్గర అప్పుగా తీసుకున్నవారు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బిజినేపల్లి మండలం సల్కరపేట గ్రామానికి చెందిన మాధవి బలవన్మరణానికి యత్నించింది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులకు ఆమె రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఆ డబ్బులు అడుగుతుండగా చాలాసార్లు గొడవలు జరిగాయని వెల్లడించింది. పెద్ద మనుషుల ముందు కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొంది. చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో చెబుతూ పురుగుల మందు తాగింది.
కఠినంగా శిక్షించాలి...
ఆమె పెద్దనాన్న కొడుకులు ఆస్తి కోసం తనని చంపాలనుకుంటున్నారని... తల్లిదండ్రులు లేని తనకు ఎవరూ అండగా లేరని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించింది. ఆ నలుగురి వల్లే తను చనిపోవాలనుకుంటున్నానని... వారిని కఠినంగా శిక్షించాలని వీడియోలో కోరింది. వాట్సప్ గ్రూపుల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే గ్రామస్థులు, పోలీసులు మాధవి కోసం గాలించారు.
ఇది రెండోసారి...
సల్కరపేట గ్రామ శివారులోని పొలాల వద్ద మాధవి అపస్మారక స్థితిలో మాధవి పడి ఉంది. ఇది గమనించిన పోలీసులు ఆమెను వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మాధవి ఈ డబ్బుల కోసం ఆత్మహత్యకు యత్నించడం ఇదే తొలిసారి కాదని, పది రోజుల క్రితం కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: అనుమానం: భార్య గొంతు కోసి పరారైన భర్త