రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన విమల అనే వివాహితపై సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన రాహుల్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో బాధితురాలు కుటుంబంతో రాహుల్‌కు పరిచయం ఉండేది. నిందితుడు రాహుల్, బాధితురాలి భర్త స్నేహితులు. ఈ పరిచయంతో స్నేహం పెరిగింది. తరచూ రాహుల్ వారింటికి వెళ్లేవాడు. విమలతో సన్నిహితంగా మెలిగేవాడు. స్నేహం ముదరడం గమనించిన విమల భర్త రవికుమార్ రాహుల్‌ను దూరం పెట్టాడు.
అప్పటి నుంచి విమల కూడా భర్తతో ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. కానీ రాహుల్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తకు విషయం చెప్పి విమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు.. రాహుల్‌ను జైలుకు పంపారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన రాహుల్.. జైలుకు పంపిందన్న కక్షతో విమలపై గొడ్డలితో దాడి చేశాడు. వెంటనే స్థానికులు ఆమెను బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని మీర్పేట్ సీఐ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: క్రైం థ్రిల్లర్: సాయం చేస్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడు!