ఓ బాలుడు గొంతులో మూత ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో వారం రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన ఏపీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్న ఒడియా వీధిలో జరిగింది.
గీతా దలై అనే మహిళ ప్రసవం కోసం రత్తకన్న ఒడియా వీధిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు లియన్స్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ఏడాది కావస్తుండటం వల్ల బిలాయిలో ఉన్న భర్త కుమార్ వద్దకు వెళ్లాలనుకుంది.
ఈనెల 10న అక్కడే బాబుకు తొలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఎన్నో కలలు కన్నారు. ఆమె అత్తారింటికి పయనం అవుతున్న తరుణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న అబ్బాయి గొంతులో ప్రమాదవశాత్తు ఓ మూత ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడక ఆ చిన్నారి మృతి చెందాడు. కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ పాప మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చూడండి: వనయాత్రలో విషాదం.. వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి