టర్కీ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో రన్‌వేపై జారి ప్రమాదానికి గురైన విమాన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 157 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆ దేశ ప్రభుత్వం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.
"ప్రస్తుతం గాయపడిన 157 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మా పౌరులలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు."
- ఫహ్రెటిన్ కోకా, టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ జరిగింది..
పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇస్తాంబుల్‌లోని సబిహా గోకెన్ విమానాశ్రయంలో దిగే సమయంలో రన్‌వేపై పక్కకు జారి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విహాంగం మూడు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బలమైన గాలులు, వర్షం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విమానం ఐజ్మిర్ నగరం నుంచి వచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 177మంది ప్రయాణికులు.. రెండు ముక్కలైన విమానం