ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గద్దె దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తన కూటమిలో ఉన్న నాఫ్తాలీ బెన్నెట్.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. విపక్షాల నేతలందరినీ కూడగట్టి మెజారిటీని నిరూపించుకునేందుకు యత్నిస్తున్నారు. యమినా పార్టీకి చెందిన నాఫ్తాలీ అధికారం ఏర్పాటు చేస్తే.. నెతన్యాహు మరో వారం రోజుల్లో విపక్షంలోకి జారుకోనున్నారు.
ఇజ్రాయెల్‌లో గత కొంతకాలంగా రాజకీయ సంక్షోభం తరహా పరిస్థితులు ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో నాలుగు సార్లు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. చివరగా మార్చి 23న జరిగిన ఎన్నికల్లోనూ ఎవరికీ మెజారిటీ దక్కలేదు. నెతన్యాహుకు చెందిన లికుడ్ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నెతన్యాహును ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానించారు. అయితే, మిత్ర పక్షాల మద్దతు ఉన్నప్పటికీ మెజారిటీ మార్క్‌ను అందుకోలేక పోయారు నెతన్యాహు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బెన్నెట్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. విపక్ష నేత యాయిర్ లాపిడ్‌తో కలిసి ఆయన జట్టు కట్టారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనను తొలగించే దిశగా తమ మధ్య ఒప్పందం కుదురుతుందని బెన్నెట్ భావిస్తున్నారు.
"నా స్నేహితుడు, ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్‌తో కలిసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మార్చి 23 ఎన్నికలో ప్రతిష్టంభన తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరైన పరిష్కారం లభించలేదు. కలిసి పనిచేస్తేనే ఇలాంటి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. నెతన్యాహు ఆధ్వర్యంలో మితవాద ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదు. మరోసారి ఎన్నికలు నిర్వహించినా ఫలితాల సరళి మారదు."
-నాఫ్తాలీ బెన్నెట్, యమినా పార్టీ నేత
చెరో రెండేళ్లు అధికారం పంచుకునే విధంగా వీరిరువురు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ కూటమికీ పలు అడ్డంకులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
లికుడ్ పార్టీ నేత బెంజమిన్ నెతన్యూహు 12 ఏళ్లుగా ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగుతున్నారు. మొత్తం 120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 61మంది సభ్యుల మద్దతు అవసరం.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఏర్పాటులో నెతన్యాహూ మళ్లీ విఫలం