తూర్పు జెరూసలెంలో పాలస్తీనా నిరసనకారులకు, ఇజ్రాయెల్ పోలీసులకు ఆదివారం మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంటూ ఇజ్రాయెల్ జాతీయవాదులు వార్షిక పరేడ్ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ వార్షిక పరేడ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఘర్షణల జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
పోలీసులకు, నిరసనకారులకు ఆదివారం సైతం ఘర్షణలు జరగ్గా.. ఇలాంటి సమయంలో పరేడ్‌కు ఇజ్రయెల్ పోలీసులు అనుమతి ఇవ్వడం ఆందోళనకు దారితీసింది.
ఇదిలా ఉంటే జెరూసలేం వార్షిక దినోత్సవానికి ముందు ప్రత్యేక కేబినెట్ భేటీ నిర్వహించారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. జెరూసలెం శాంతికి ఎవరూ విఘాతం కలిగించినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఉగ్రవాద చర్యలను ఉపేక్షించమని తెలిపారు. శాంతిభద్రతలను అమలు చేయడంలో నిర్ణయాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
ఖండించిన అమెరికా..
జెరూసలేంలో పాలస్తానీలపై జరుగుతున్న దాడులను అగ్రరాజ్యం ఖండించింది. శాంతిస్థాపనకు చొరవ చూపాలని పిలుపునిచ్చింది. జెరూసలేం వేడుకలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా భద్రతా సలహాదారు జేక్ సలివన్.. ఇజ్రాయెల్‌కు సూచించారు.
రాకెట్ దాడులు
ఓ వైపు తూర్పు జెరూసలేంలో ఉద్రిక్తతలు చెరరేగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు జరిగాయి. స్థానిక మీడియో కథనాల ప్రకారం.. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి రెండు రాకెట్లను అష్కెలోన్ నగరంవైపు లాంఛ్ చేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐటీఎఫ్) వెల్లడించింది. మరో రెండు రాకెట్లను అర్ధరాత్రి దాటాక వదిలారని తెలిపింది.
ఇదీ చదవండి: జెరూసలెంలో ఘర్షణలు- 200 మందికి గాయాలు!