అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుపై.. నమోదైన పలు కేసుల విచారణ ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆయన జెరూసలేం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ముఖానికి మాస్కు ధరించి న్యాయస్థానానికి వచ్చారు.
లంచం, మోసం, విశ్వాస ఘాతుకం వంటి ఆరోపణలపై నెతన్యాహుపై మూడు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన స్నేహితుల నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించారనే అభియోగాలు ఉన్నాయి. వీటితోపాటు మీడియా సంస్థల అధినేతలకు సానుకూలంగా వ్యవహరించి సహాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను నేటి నుంచి ప్రారంభించింది.
నెతన్యాహు తిరిగి ఐదోసారి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన కేవలం వారం రోజుల్లోనే ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండి నేర విచారణ పొందుతున్న తొలి ఇజ్రాయిల్ ప్రధాని ఈయనే. గతంలో ఇజ్రాయిల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మర్ట్ లంచం తీసుకున్న కేసులో 16 నెలలు జైలుపాలయ్యారు.