ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల నేపథ్యంలో అట్టుడుకుతున్న లాడ్ నగరంలో అత్యయిక స్థితిని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. 1966లో ఇజ్రాయెల్‌లోని అరబ్లపై సైనిక పాలన రద్దు అయిన తర్వాత వారిపై ఇలా అత్యయిక స్థితిని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం నెతన్యాహు మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాడ్ నగరంలో ప్రధాని నెతన్యాహు బుధవారం పర్యటించనున్నట్లు సమాచారం. నగరంలో దాడుల కారణంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది.
ప్రధాని హెచ్చరిక..
"మిలిటెంట్ల దాడులను సైన్యం దీటుగా ఎదుర్కొంది. అయితే ఈ పోరాటం మరికొంత కాలం కొనసాగుతుంది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ తగిన మూల్యం చెల్లించుకున్నాయి. మరింత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మిలిటెంట్లను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రతిదాడులు కొనసాగుతాయి. మిషన్ పూర్తి కావడానికి సమయం పడుతుంది"
-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
పెరిగిన మృతుల సంఖ్య..
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 32కి చేరింది. వైమానిక దాడులకు 220 మంది గాయపడ్డారు. ఈ విషయాలను స్థానిక మీడియా వెల్లడించింది.
విదేశాల ఆందోళన..
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు తక్షణం దాడులను నిలిపివేయాలని కోరింది. రాకెట్ దాడులను ఖండించిన భారత్.. శాంతి చర్చలకు సిద్ధం కావాలని సూచించింది. అమెరికా, జపాన్ దేశాలు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి : ఇజ్రాయెల్-పాలస్తీనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు!