ఇతర దేశాలపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని ఖండించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి భారత్- బహ్రెయిన్ దేశాలు. పరోక్షంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి బహ్రెయిన్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రక్షణ, ఉగ్రవాద నిర్మూలనపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇరు దేశాధినేతలు.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆయా దేశాలు వాటిని నాశనం చేయాలని.. ఇతర దేశాలపై ఉగ్రచర్యలకు పాల్పడేవారిని చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రకటనలో స్పష్టం చేశాయి.
ప్రధాని పర్యటనలో భాగంగా సైబర్ భద్రతకు ఇరు దేశాలు సహకారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు నేతలు. రక్షణ, తీవ్రవాద నిర్మూలన, నిఘా, సమాచార మార్పిడి వంటి అంశాల్లో సహకారంపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తీవ్రవాద నిర్మూలనకు అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదులు, వారి సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఇదీ చూడండి: బహ్రెయిన్: శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి మోదీ శ్రీకారం