Victory Day Zelenskyy: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించిన సందర్భంగా జరుపుకొనే విక్టరీ డే సందర్భంగా మాట్లాడిన ఆయన... త్వరలో ఉక్రెయిన్‌కు మరో విక్టరీ డే రాబోతోందని అన్నారు.
Russia Ukraine war: "త్వరలో మనకు రెండు విక్టరీ డేలు ఉంటాయి. ఇంకొందరికి ఆ ఒక్కటి కూడా మిగలదు. మనం అప్పుడు గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తాం. రెండో ప్రపంచ యుద్ధంలో మన పూర్వీకులు ఏం చేశారో మనం మర్చిపోవద్దు. 80 లక్షల మంది ఉక్రెయినియన్లు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురిలో ఓ ఉక్రెయిన్ పౌరుడు ఈ దేశానికి తిరిగి రాలేదు. మొత్తంగా ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆ యుద్ధానికి బలయ్యాయి" అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
"ఇప్పుడు చెడు మళ్లీ తిరిగి వచ్చింది.. కొత్త రూపం ధరించి, కొత్త నినాదాలు వల్లె వేస్తూ. కానీ లక్ష్యం మాత్రం అదే. ఉక్రెయిన్, దాని మిత్ర రాజ్యాలదే గెలుపు. అనైతిక చర్యలకు దిగిన వారెవరు తప్పించుకోలేరు. బంకర్‌లో దాక్కోలేరు" అంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. జర్మనీ నియంత, నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ తన చివరి రోజుల్లో రాజధాని నగరం బెర్లిన్‌లోని బంకర్‌లో దాక్కున్నారు. మిత్ర రాజ్యాలు గెలుపు వైపుగా వెళ్తుండగా.. యుద్ధం ముగింపు సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదీ చదవండి: 'మాతృభూమి కోసమే ఈ యుద్ధం'.. 'విక్టరీ డే' ప్రసంగంలో పుతిన్