Covid 19 Deaths: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను..వ్యాక్సిన్లు సమర్థంగా నిరోధించినట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. భారత్‌లో ఒక్క ఏడాదిలోనే 42 లక్షల మరణాలను కరోనా టీకాలు నివారించినట్లు ది లాన్సెట్ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. వ్యాక్సిన్ పంపిణీతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిపుణులు అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీ మొదలుపెట్టిన తొలి సంవత్సరంలో డిసెంబర్ 8, 2020 నుంచి డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో నివారించగలిగిన కొవిడ్ మరణాలను ఈ అధ్యయనం ద్వారా అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల 2021లో భారత్‌లో 42 లక్షల పది వేల కొవిడ్ మరణాలను నివారించగలిగినట్లు అధ్యయనం తేల్చి చెప్పింది. డెల్టా వేరియంట్‌తో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న భారత్‌లో వ్యాక్సినేషన్ పంపిణీ ఎంతో ప్రభావాన్ని చూపించిందని అధ్యయనం వెల్లడించింది.
భారత్‌లో అధికారిక లెక్కల ప్రకారం 5 లక్షల 24 వేల 941 మరణాలు సంభవించగా వాస్తవానికి ఈ సంఖ్య 10రెట్లు అధికంగా ఉండవచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. భారత్‌లో 47లక్షల కొవిడ్ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ఇటీవల నివేదించింది. అయితే, దేశంలో కొవిడ్ మహమ్మారి సమయంలో 51 లక్షల 60 వేల మరణాలు సంభవించి ఉండవచ్చనే అంచనాల ఆధారంగా వీటిని రూపొందించామని లండన్ పరిశోధకులు పేర్కొన్నారు.
కొవిడ్ మరణాల వాస్తవ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 14 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయనుకుంటే.. అందులో దాదాపు 2కోట్ల మరణాలను వ్యాక్సిన్‌లు నివారించగలిగినట్లు తాజా నివేదిక అంచనా వేసింది. అమెరికాలో 19 లక్షలు, బ్రెజిల్‌లో 10 లక్షలు, ఫ్రాన్స్‌లో 6 లక్షల 31 వేలు, బ్రిటన్ 5 లక్షల మరణాలను వ్యాక్సిన్‌లు నివారించినట్లు వెల్లడించింది. 2021 చివరినాటికి ప్రతి దేశంలో కనీసం 40శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించి ఉంటే మరో 5 లక్షల 99 వేల 300 మరణాలు నిరోధించే వారమని పేర్కొంది. దాదాపు 185 దేశాల్లో అధికారిక లెక్కల కంటే వాస్తవ మరణాల సంఖ్యతో ఈ అంచనాలు వేసినట్లు తెలిపింది. అయితే, ఈ విశ్లేషణలో చైనాను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని.. ఒకవేళ తీసుకుంటే తాజా గణాంకాల్లో చాలా మార్పు ఉంటుందని లాన్సెట్ జర్నల్ తెలిపింది.
ఇదీ చదవండి: పిల్లల్లో 2 నెలల పాటు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు!