Dogs corona patients: శిక్షణ పొందిన జాగిలాలు విమానాశ్రయాలకు వచ్చే కరోనా వైరస్ బాధిత ప్రయాణికులను సమర్థంగా గుర్తించగలవని తాజా అధ్యయనంలో తేలింది. పరీక్షల నిర్వహణకు తగిన వసతులు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి జాగిలాల ద్వారా మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్, పారాసైటిక్ ఇన్‌ఫెక్షన్లతో పాటు శరీర జీర్ణక్రియల సమయంలో విడుదలయ్యే వివిధ సేంద్రియ సమ్మేళనాలను శునకాలు గుర్తించగలుగుతాయి.
Dogs corona news: అయితే, ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకులు- నాలుగు జాగిలాలకు కరోనా వైరస్‌ను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. అంతకుముందు వాటికి నిషేధిత ఔషధాలు, ప్రమాదకర వస్తువులు, క్యాన్సర్లను గుర్తించడంలోనూ తర్ఫీదు ఇచ్చారు. తర్వాత మొత్తం 420 మంది వాలంటీర్ల స్కిన్ స్వాబ్ నమూనాలను వాటి ముందు ఉంచగా... ఈ నాలుగు జాగిలాలు వారిలో 114 మంది కరోనా బాధితులను కచ్చితంగా గుర్తించాయి. మిగతా 306 మంది పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చినవారే కావడం విశేషం.
ఏడు దఫాల శిక్షణ తర్వాత ఈ స్వాబ్ నమూనాలను అవి 92% కచ్చితత్వంతో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 28 మంది బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వారిని సైతం జాగిలాలు గుర్తించడం విశేషం. ఒక్క కేసులో మాత్రం ఇవి తప్పుగా నెగెటివ్ అని గుర్తించాయని, రెండు నమూనాల వాసన సరిగా చూడలేదని వారు పేర్కొన్నారు. 2020 సెప్టెంబరు- 2021 ఏప్రిల్ మధ్య హెల్సింకి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు పీసీఆర్ పరీక్షలతో పాటు జాగిలాల ముందు ఆ నమూనాలను ఉంచగా... 98% కచ్చితత్వంతో వాటిని నెగెటివ్/పాజిటివ్‌గా గుర్తించినట్టు పరిశోధకులు వివరించారు.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. ఇక 6 నెలల్లోనే గ్రీన్కార్డ్కు క్లియరెన్స్!