Srilanka Crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ చేజారుతున్నాయి. ఓ వైపు నిత్యావసరాల కొరత, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమంతో లంక అట్టుడుకుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సర్బీ వెల్లడించారు. అప్పుడే ఇంధనం, ఔషధాల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయగలమన్నారు.
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలీ సర్బీ తొలిసారిగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. "ప్రస్తుతం మేం ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు. ఇప్పుడు మాకు పోరాడటం తప్ప మరో అవకాశం లేదు. ఈ సంక్షోభం నుంచి కొంతైనా బయటపడాలంటే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలి. అయితే ఇది చాలా కష్టమైన పని. ఈ విషయమై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని సర్బీ తెలిపారు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్‌లతో పాటు చైనా, అమెరికా, బ్రిటన్, మధ్య ప్రాశ్చ్య దేశాల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కరోనా మహమ్మారితో పాటు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా శ్రీలంక తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జేపీ మోర్గాన్ నివేదిక అంచనాల ప్రకానం.. ఈ ఏడాది లంక స్థూల అప్పులు 7 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముంది. ఇక ద్రవ్యలోటు కూడా 3 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చి నాటికి లంక విదేశీ మారక నిల్వలు 1.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న లంకను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను ప్రకటించింది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్ మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలాగే చైనా, ఐఎంఎఫ్ నుంచి కూడా రుణ సమీకరణకు లంక తమ చర్యలకు వేగవంతం చేస్తోంది.
ఇదీ చదవండి: కీవ్‌లో బోరిస్ ఆకస్మిక పర్యటన.. ఆయుధాలిస్తామని జెలెన్స్కీకి హామీ