Ship with cars burning : నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3 వేల కార్లతో అట్లాంటిక్ సముద్రంలో వెళ్తుండగా నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నౌకలోని కార్లన్నీ దగ్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. నౌకలో మంటలు పెరగగానే అందులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. మంటలను తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకేశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. సముద్రంలో దూకిన వారిని కాపాడారు. నౌక పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Fremantle Highway vessel : ఫ్రెమాంటిల్ హైవే అనే ఈ నౌక జర్మనీలోని బ్రెమెన్ పోర్టు నుంచి బయల్దేరింది. ఈ నౌక.. ఈజిప్టులోని ఓ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈ నౌకలో 2857 కార్లు ఉన్నాయి. అందులో ఎలక్ట్రిక్ వాహనాలు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అట్లాంటిక్ సముద్రంలో భాగమైన నార్త్ సీ మీదుగా వెళ్తున్న సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. అప్పుడు నౌక అమేలాండ్ ద్వీపానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని భావించిన కొంతమంది సిబ్బంది.. సముద్రంలోకి దూకేశారు.
సమాచారం అందుకున్న డచ్ కోస్ట్ గార్డ్.. సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్లు, పడవల సాయంతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నౌకలోని 23 మంది సిబ్బందిని రెస్క్యూ బృందాలు బయటకు తీసుకొచ్చాయి. అందులో ఓ వ్యక్తి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించాయి. మిగిలినవారిలో చాలా మందికి గాయాలయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ నౌక సముద్రంలో మునిగిపోకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలిపారు.
"ప్రస్తుతం అక్కడ చాలా నౌకలు ఉన్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. మంటలను ఎలా ఆర్పాలో సిబ్బంది ఆలోచిస్తున్నారు. కానీ, అంతా వాతావరణంపైనే ఆధారపడి ఉంది. నౌక ఏమేరకు దెబ్బతిందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. నౌక మునిగిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాం. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. నష్టాన్ని పరిమితం చేసేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం."
-లియా వెర్స్టీగ్, కోస్ట్ గార్డ్ ప్రతినిధి