Sex Crime laws In Japan : అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాలకు కీలక మార్పులు చేసింది జపాన్. అందులో భాగంగా లైంగిక చర్యల విషయంలో సమ్మతి వయసును 13 ఏళ్ల నుంచి 16 సంవత్సరాలకు పెంచింది. ఈ విషయంలో 13 ఏళ్ల వయసే.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి తక్కువ. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు జపాన్ చట్టసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతోపాటు అత్యాచార కేసుల విచారణ, ఇతరుల లైంగిక చర్యలను వీక్షించడం వంటి వాటిపైనా తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు స్పష్టత ఇచ్చింది.
Sexual Consent Age In Japan : లైంగిక చర్యకు సమ్మతి తెలిపే విషయంలో కనీస వయసు వివిధ దేశాల్లో వేరుగా ఉంది. బ్రిటన్‌లో ఈ వయసు 16 ఏళ్లుగా ఉండగా, ఫ్రాన్స్‌లో 15 ఏళ్లు, జర్మనీ, చైనాల్లో 14 ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసు వారికంటే తక్కువ వయసు ఉన్న వాళ్లతో పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అది అత్యాచారం కిందికే వస్తుంది. లైంగిక ప్రయోజనాల కోసం.. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి డబ్బు ఆశచూపి బలవంతపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా నేరమే. అందుకు జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే, జపాన్‌లో ఇప్పటివరకు లైంగిక చర్యకు సమ్మతి కనీస వయసు 13 ఏళ్లుగా ఉంది. వీటికి సంబంధించిన నిబంధనల్లో 1907 నుంచి జపాన్ మార్పులు చేయలేదు.
అత్యాచార నేరాలకు సంబంధించిన పలు చట్టాలకు 2017లో జపాన్ కొన్ని మార్పులు చేసింది. అయితే, ఆ మార్పులు నేర నియంత్రణకు సరిపోవంటూ అప్పట్లో జపాన్వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అదే సమయంలో అత్యాచార కేసుల్లో విచారణ ఎదుర్కొని.. నిర్దోషులుగా బయటపడ్డ వందల మంది ర్యాలీలు చేపట్టారు. ఇక, వీరిని వ్యతిరేకిస్తూ లైంగిక దాడులకు గురైన అనేక మంది బాధితులు, వారి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలా అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాల్లో అవసరమైన మార్పులు తేవాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. దీంతో జపాన్ ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశ మానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి.
Age Of Consent In India : భారతదేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే వయసు పోక్సో చట్టం, 2012 ప్రకారం 18 ఏళ్లుగా ఉంది. పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అది అత్యాచారం కిందకే వస్తుంది. అయితే, ఈ విషయంలో సమ్మతి వయసు వివిధ చట్టాల ద్వారా పెరుగుతూ వచ్చింది. 1940 నుంచి 2012 వరకు 16 ఏళ్లుగా ఉంది.