Philippine ferry fire: ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 134 మంది ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చేలరేగాయి. దీంతో ఏడుగురు మరణించారు. సుమారు 120 ప్రయాణికులను రక్షించినట్లు తీరప్రాంత రక్షణ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న నలుగురు గల్లంతయ్యారని.. అనేక మంది ప్రయాణికులు, సిబ్బంది నీటిలో దూకినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన ఈశాన్య ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో సోమవారం జరిగినట్లు చెప్పారు. ఇంజిన్‌లో తలెత్తిన లోపమే ప్రమాదానికి కారణమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఐదుగురిని కాల్చి చంపిన దుండగులు: అమెరికా సమీపంలోని ప్యూర్టోరికోలో గుర్తుతెలియని వ్యక్తులు ఐదుగురిని కాల్చి చంపారు. ఈ ఘటన సాన్జాన్లో ఆదివారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఇంకా గుర్తించలేదని.. మృతికి గల కారణాలను ప్రస్తుతం వెల్లడించలేమని చెప్పారు. ఇదే ప్రాంతంలో గత నెలలో కూడా ఇద్దరిని దారుణంగా కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా 32లక్షల మంది జనాభా ఉన్న దీవిలో కాల్పుల ఘటనల్లో ఈ ఒక్క ఏడాదిలోనే 235 మంది మరణించారు. గతేడాది 234 మంది ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి: అమెరికాలోని మెక్సికో నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీ కొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను వలసదారులుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని గుర్తించాల్సి ఉందని.. గాయపడిన వారిలో తొమ్మిది మందిని హొండురస్, నలుగురిని గాటేమల, నికర్గాన్ దేశాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్లో చియపాస్‌లో జరిగిన ప్రమాదంలో సుమారు 56 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: టోక్యోలో అడుగుపెట్టిన మోదీ.. జపాన్ టూర్ షురూ