పాకిస్థాన్‌లోని దారుణం జరిగింది. కరాచీ నగరంలో ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో సహా.. చాలా మంది మహిళలు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇదీ జరిగింది..
రంజాన్ సందర్భంగా ఆహారం పంపిణీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు.. పొరపాటున కరెంటు తీగపై కాలు వేయడం వల్ల షాక్ గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగు తీయడం వల్ల తొక్కిసలాట ప్రారంభమై దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాటలో ఒకరినొకరు తోసుకోవడం వల్ల కొంతమంది మురికి కాలువలో పడ్డారని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు మినహా.. ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కరాచీ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ ఆహార పంపిణీ గురించి ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇస్తే బాగుండేదని అన్నారు.
పిండి కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాట..11 మృతి
ఇటీవలే ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున.. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్. అందులో భాగంగా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పిండిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇదే తరహా ఘటనల్లో ఇప్పటివరకు 22 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు దక్షిణ పంజాబ్‌లోని సహివాల్, బహవాల్పుర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాల్లో తొక్కిసలాట ఘటనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 60 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఫైసైలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లోనూ తొక్కిసలాట ఘటనలు జరిగాయి.
ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్..
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ప్రజల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. దీని నుంచి బయటపడడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజ్ కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతోంది. కానీ, ఐఎంఎఫ్ విధించిన షరతుల వల్ల.. ఆ చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇక, వారాంతపు ద్రవ్యోల్బణం జీవిత కాలం గరిష్ఠ స్థాయి 45 శాతానికి చేరుకుంది. దీంతో పాటు పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారకం 4.2 బిలియన్ డాలర్లుగా ఉంది.