ETV Bharat / international

పుతిన్​కు ఉద్వాసన తప్పదా? మరో గోర్బచెవ్‌ అవుతారా?

Russia Ukraine war: పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు ఏర్పడిన పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఓడితే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​.. ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసంతృప్తి తిరుగుబాటుగా మారొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాటి సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్​లా.. పుతిన్ సైతం తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

PUTIN GORBACHEV
PUTIN GORBACHEV
author img

By

Published : Mar 27, 2022, 6:44 AM IST

Russia Ukraine war: సోవియట్‌ యూనియన్‌ ఎందుకు పతనమైందో తెలుసా? నాటి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌ 1985లో 'పెరిస్త్రోయికా' పేరుతో ఆర్థిక, సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవి ఘోరంగా వికటించి తీవ్ర ఆర్థిక పతనానికి దారితీశాయి. ఆ ఊబినుంచి బయటపడలేక.. చివరికి సోవియట్‌ యూనియన్‌ తన ఉనికినే కోల్పోయింది. గోర్బచెవ్‌ రాజకీయ అంతానికీ ఆ సంస్కరణలే కారణమయ్యాయి. రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ అవతరణకూ నాటి సంక్షోభమే బీజం వేసింది. రెండు దశాబ్దాల పాలనలో పుతిన్‌ తెచ్చిన సంస్కరణలు రష్యాకు భారీ ఉపశమనం కలిగించలేదు. మాస్కో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరుచేసి, ఉక్రెయిన్‌పై ఆయన యుద్ధం ప్రకటించారు. పుతిన్‌ మొండి చర్య- రష్యా ఆర్థికస్థితికి పెనుగండలా తయారయింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తూ అమెరికా, పాశ్చాత్య దేశాలు మాస్కోపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యన్‌ ప్రముఖులు, బడా వ్యాపారుల కార్యకలాపాలనూ అంతర్జాతీయంగా అడ్డుకున్నాయి. క్రెమ్లిన్‌కు ప్రధాన ఆదాయవనరైన సహజ వాయువు, పెట్రో ఉత్పత్తుల కొనుగోలును నిలిపేశాయి. దాదాపు విదేశీ సంస్థలన్నీ మాస్కోను వీడాయి. ఆంక్షల పర్యవసానంగా రష్యాలో ధరలు మండిపోతున్నాయి. ఔషధాల రేట్లు 20% పెరగడంతో రష్యన్లు శనివారం ఫార్మసీల వద్ద బారులు తీరడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. పైకి గుంభనంగా కనిపిస్తున్నా... రష్యా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మరో 'పెరిస్త్రోయికా'ను తలపిస్తోంది!

Vladimir Putin perestroika: సోవియట్‌ యూనియన్‌ పతనమయ్యే సమయానికి దాని ఆర్థిక వ్యవస్థ... భారత్‌ కంటే రెండింతలు, చైనా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే 175% మేర ఎక్కువ. పెరిస్త్రోయికా ఆధార ఆర్థిక వ్యవస్థను వదిలించుకున్న తర్వాత... పుతిన్‌ నేతృత్వంలో రష్యా ఆర్థికంగా కొంత పుంజుకొంది. కానీ, గత 32 ఏళ్లలో క్రెమ్లిన్‌ సాధించిన వృద్ధి 3.5 రెట్లు మాత్రమే. 1991లో సోషలిస్ట్‌ ఆర్థిక విధానాలను విడిచిపెట్టిన భారత ఆర్థిక వ్యవస్థ 11 రెట్లు పెరిగింది. 1979లో పెట్టుబడిదారీ విధానాన్ని అందుకున్న చైనా ఆర్థిక వ్యవస్థ 35 రెట్లు పెరిగింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే... రష్యా సాధించిన వృద్ధి తక్కువే. అందుకు ప్రధాన కారణం పెరిస్త్రోయికా పర్యవసానాలేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పతన సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఆర్థికవ్యవస్థ అమెరికాలో దాదాపు సగం ఉండేది. ఇప్పుడు రష్యా కంటే అమెరికా ఆర్థికంగా తొమ్మిది రెట్లు అధికంగా బలపడింది. ఇలాంటి తరుణంలో చేపట్టిన ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరి నాటికి 15% కుంచించుకుపోతుందని అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ అంచనా వేసింది. ఆ తర్వాత కూడా పతనం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది.

మసకబారుతున్న పుతిన్‌ ప్రతిష్ఠ...: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా... ప్రపంచంలో దాదాపు ఏకాకి అయింది. క్రెమ్లిన్‌ యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 140 దేశాలు మద్దతు తెలపగా... చైనా, మరో మూడు దేశాలు మాత్రమే రష్యాకు తోడు నిలిచాయి. నిఘా వైఫల్యాలు, ఉక్రెయిన్‌లో యుద్ధ వ్యూహం బెడిసికొట్టడం, చాలా ఆయుధాలు గురితప్పడం, మాస్కో బలగాలు బలహీనపడటం వంటి పరిణామాలు పుతిన్‌ ప్రతిష్ఠను మసకబార్చుతున్నాయి. యుద్ధంలో ఓటమి ఎదురైతే- పుతిన్‌ ఆత్మరక్షణలో పడవచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే- పుతిన్‌ ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రపంచం దృష్టిలో ఆయన హీరో అవుతారు. ఓటమిని మూటగట్టుకుంటే మాత్రం- పుతిన్‌కు ఇంటా, బయటా తీవ్ర విపరిణామాలు తప్పకపోవచ్చు. చివరికి అధ్యక్ష పీఠం నుంచి ఉద్వాసనకూ గురికావచ్చు. ఇదీ- ప్రపంచ వ్యాప్తంగా పలువురు నిపుణులు చెబుతున్న మాట!

అధ్యక్షుడిని ఎలా సాగనంపుతారు..: ఉక్రెయిన్‌పై యుద్ధం చాలామంది రష్యన్‌ ఉన్నతాధికారులకు ఇష్టం లేకపోయినా... పుతిన్‌ చర్యలకు భయపడి వారు కొనసాగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పుతిన్‌ ఆదేశాలను ధిక్కరించి గతంలో రాజకీయాల్లో తలదూర్చిన వ్యాపారవేత్తలు ఖొడొర్‌స్కోవ్‌స్కీ, బెరెజోవ్‌స్కీల వంటివారు జైలుపాలయ్యారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బడా వ్యాపారులు కొందరు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం వికటిస్తే, పుతిన్‌ చుట్టూ ఉన్న కొంతమంది జనరల్స్‌, ఇతర ఉన్నతస్థాయి అధికారులు నాయకత్వ మార్పునకు చర్యలు తీసుకునే అవకాశముందని రష్యన్‌ సాయుధ దళాల నిపుణుడు, రాజకీయ శాస్త్రవేత్త పావెల్‌ లూజిన్‌ విశ్లేషించారు. వారికి పోలీసులు, విపక్ష నేతలు, సామాన్యులు తోడైతే అధ్యక్షుడిని సాగనంపడం సాధ్యమవుతుందని... ఇదంతా పుతిన్‌కు తెలుసుకాబట్టే తన సైన్యాన్ని, పోలీసులను కూడా ఆయన నమ్మడం లేదని లూజిన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం అనంతరం పరిస్థితులు చేయిదాటితే... పుతిన్‌ తనంతట తానుగా పాలనకు దూరంకావచ్చు. ఆయన ప్రమేయం లేకుండానే ఉన్నతాధికారులు పాలన సాగించవచ్చు. ఒకవేళ ఈ పరిస్థితే ఎదురైతే... తిరుగుబాటుతో నిమిత్తం లేకుండానే రష్యా రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

దశాబ్దాల భవిష్యత్తుపై ప్రభావం..: ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. సైనిక చర్య కారణంగా ఆర్థిక వ్యవస్థ మూడింట ఒక వంతు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాడు సోవియట్‌ పతనంపై పశ్చిమ దేశాల హస్తముంది. అమెరికా 40వ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ దూకుడుగా తెచ్చిన 'స్టార్‌వార్‌' రక్షణ సంస్కరణలకు దీటుగా గోర్బచెవ్‌ పెరిస్త్రోయికాను ప్రవేశపెట్టారు. దీని ప్రతికూల ప్రభావం క్రమంలోనే... 'నాటో'ను నిలువరించేందుకు పుతిన్‌ ప్రయత్నిస్తూ వచ్చారు. ఇందుకు భారీగా వ్యయమవుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలతో.. ఆ పర్యవసానాలు దేశ ఆర్థిక పతనానికి కారణమవుతాయని, దాన్నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.