Russia Ukraine War: ఎన్ని హెచ్చరికలు చేసినా తమ దారికిరాని ఉక్రెయిన్‌పై రష్యా విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ను ఆక్రమణలో విఫలమైన మాస్కో బలగాలు పారిశ్రామిక ప్రాంతమైన తూర్పు ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. డాన్‌బాస్ ఆక్రమణే లక్ష్యంగా.. క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. డాన్‌బాస్ ప్రాంతంలోని క్రెమినా నగరాన్ని చుట్టుముట్టిన పుతిన్ బలగాలు మరికొన్ని ప్రాంతాల ఆక్రమణ దిశగా కదులుతున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్‌ను వీడిన వారి సంఖ్య 50 లక్షలు దాటినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయి.
ఉక్రెయిన్‌పై తొలిదశ యుద్ధం విజయవంతమైనట్లు ప్రకటించిన రష్యా రెండో దశలో భీకర దాడులకు పాల్పడుతోంది. లొంగిపోకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని అల్టిమేటం జారీచేసినా జెలెన్‌స్కీ బలగాలు తలొగ్గపోగా.. మాస్కో సేనలు తూర్పు ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. డాన్‌బాస్ సంపూర్ణ విముక్తే లక్ష్యమని ప్రకటించిన క్రెమ్లిన్ ఇప్పటికే క్రెమినా నగరాన్ని చుట్టుముట్టింది. ఎటు చూసినా వీధి పోరాటాలే జరుగుతున్నాయని, నగరాన్ని రష్యా సైన్యం దాదాపు నేలమట్టం చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. క్రెమినా సమీపంలో మరో చిన్న పట్టణాన్ని కూడా పుతిన్ సేనలు ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 1,053 ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. 106 ఫైరింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
Zelensky Russia: తమతో పోరాడేందుకు రష్యా అందుబాటులో ఉన్న ఆయుధాలన్నింటినీ మోహరిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పోరాటం భీకరంగా సాగుతోందన్న ఆయన ఈ పోరులో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు ప్రాంతంపై పోరాటానికి రష్యా అదనపు బలగాలను మోహరిస్తోందని అమెరికా నిఘా విభాగం హెచ్చరించింది. 50 నుంచి 60 వేల మందిని రంగంలోకి దింపిందని తెలిపింది. డాన్‌బాస్‌లో మాస్కో మోహరించిన బలగాల్లో విదేశీయులు కూడా ఉన్నారని యూరోపియన్ యూనియన్ అధికారి తెలిపారు. వీరంతా వాగ్నర్ గ్రూప్, సిరియా, లిబియా నుంచి వచ్చిన వారని వెల్లడించారు.
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి సాయం కొనసాగుతోంది. వంద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అందించేందుకు నార్వే ముందుకురాగా భారీ శతఘ్నులను పంపనున్నట్లు కెనడా ప్రకటించింది. అమెరికా కూడా మరోసారి సైనిక సాయాన్ని అందించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రష్యాకు అత్యంత అనుకూల దేశం హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ అధికారికంగా ప్రకటించింది.
Russia-Ukraine Peace Talks: శాంతిచర్చలకు సంబంధించి తమ డిమాండ్ల ముసాయిదాను ఉక్రెయిన్‌కు ఇచ్చినట్లు ప్రకటించిన రష్యా.. కీవ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. స్పష్టమైన ఒప్పంద ముసాయిదా పత్రాన్ని తాము ఆమోదించామని.. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. చర్చల అంశంపై ఉక్రెయిన్ చాలా నెమ్మదిగా స్పందిస్తోందని విమర్శించారు.
ఇవీ చూడండి: మరో ప్రచ్ఛన్న యుద్ధం! అమెరికా ఆధిపత్యానికి తెర?