నేపాల్ విమాన దుర్ఘటన మరువక ముందే మరో విమానం ప్రమాదం అంచువరకూ వెళ్లి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నుంచి సిడ్నీకి బయల్దేరిన క్వాంటాస్ విమానం క్యూఎఫ్144 పసిఫిక్ సముద్రంపై గగనతలంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఈ సమస్య తలెత్తింది. అప్పటికి ఇంకా గంట ప్రయాణం మిగిలి ఉంది.
రెండు ఇంజిన్లు ఉండే ఈ బోయింగ్ 737 మోడల్ విమానంలో దాదాపు 145 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే అలర్ట్ జారీ చేసింది. ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వైమానిక రంగంలో ఈ అలర్ట్ జారీ చేస్తారు. దీంతో సిడ్నీ ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, అత్యవసర సిబ్బందిని మోహరించారు. ఇంజిన్ సమస్యతోనే ప్రయాణించి.. నిర్ణీత సమయానికంటే ముందుగానే ఈ విమానం సిడ్నీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని క్వాంటాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ విమానాన్ని ఇంజినీర్లు పరీక్షిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత సురక్షిత ఎయిర్‌లైన్స్‌లలో క్వాంటాస్ ఒకటిగా పేరుగాంచింది. 70 ఏళ్లుగా ఈ సంస్థకు చెందిన విమానాలు ప్రమాదానికి గురికాలేదు.