Russia Ukraine war: డాన్‌బాస్ ప్రాంత విముక్తి కోసం ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించామని చెబుతూ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ కూడా తమ బలగాల చేజిక్కిందని, డాన్‌బాస్ ప్రాంతంలోని కీలక ప్రాతాలన్నింటిపైనా తాము పట్టు సాధించామని తెలిపారు. ఇక్కడ పోరాటంలో పాల్గొన్న తమ బలగాలు విజయం సాధించాయని సోమవారం పుతిన్ వివరించారు. అయితే తాము వెనక్కి తగ్గడం వాస్తవమే అయినా అక్కడ మరోసారి పోరాటం చేస్తామని ఉక్రెయిన్ సైనికాధికారులు ప్రతినబూనారు. తమకు ఆధునిక ఆయుధాల సరఫరా పెరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. కాగా స్లొవియాన్స్క్‌పై సోమవారం రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భూతల నరకం ఉంటే అది ఇదే': భూమ్మీద నరకమంటూ ఏదైనా ఉంటే అది ఇదే. అటు చూస్తే మంటల్లో నగరాలు. ఇటుచూస్తే క్షతగాత్రులైన సహచరులు. కందకాల్లో తలదాచుకోవడం, నిరీక్షిస్తూ ప్రార్థించడం. ఇదే మా పని' అని ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. డాన్‌బాస్ ప్రాంతం నుంచి వెనక్కి వస్తున్న సైనికులు వార్తాసంస్థలకు ఇచ్చిన ముఖాముఖిలో తమ కష్టాలు పంచుకున్నారు. విరామం లేకుండా కొనసాగుతున్న దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయనీ, దానివల్ల మానసికంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెప్పారు. గాయపడిన వారిని తరలించాలంటే ఒక్కోసారి రెండేసి రోజులు నిరీక్షించాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ కాళ్లు, చేతులు పని చేస్తున్నట్లయితే యుద్ధక్షేత్రంలోకి వెళ్లాల్సిందేనని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండడం, వారి క్షేమ సమాచారం గురించి ఉన్న ఆందోళన తమపై తీవ్ర ప్రభావం చూపేదని సైనికులు పేర్కొన్నారు. కొద్దిపాటి శిక్షణతో తొలిసారి రణక్షేత్రంలో అడుగుపెట్టినవారు అక్కడి పరిస్థితులపై పెదవి విరిచారు. ఆయుధాల పరంగా తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న రష్యాతో గట్టిగా పోరాడుతూ దేశం కోసం కట్టుబడి ఉన్నామని మరికొందరు సైనికులు చెప్పారు. సీవీరోదొనెట్స్క్‌లో ప్రత్యక్ష నరకం చవిచూశామని కొందరు సైనికులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువును మట్టి కరిపించాలనే లక్ష్యంతోనే పోరాటం చేశామని చెప్పారు. రష్యా ఆక్రమణలోకి వెళ్లిన తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ సైనికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పునర్నిర్మాణానికి ప్రపంచ చేయూత అవసరం: ఉక్రెయిన్ పునర్నిర్మాణం యావత్ ప్రపంచ ఉమ్మడి లక్ష్యమని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తమ దేశాన్ని తిరిగి నిర్మించడానికి 750 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.60 లక్షల కోట్లు) ఖర్చవుతుందని ప్రధాని డెనిస్ షిమ్‌హాల్ రూపొందించిన ప్రణాళికను ప్రస్తావిస్తూ.. తమ దేశమొక్కటే ఈ పనిని పూర్తిచేయడం సాధ్యం కాదని చెప్పారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం స్విట్జర్లాండ్‌లో జరిగిన సదస్సును ఉద్దేశించి వీడియో ద్వారా ఆయన ప్రసంగించారు.
మరోవైపు, ఉక్రెయిన్ లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో.. అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ వ్యోమగాములు సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ 'రోస్‌కాస్మోస్'.. 'భూమితోపాటు రోదసిలోనూ ఉత్సవం చేసుకోగల విముక్తి దినం'గా అభివర్ణించింది. అక్కడి రష్యన్ కాస్మోనాట్స్ ఒలేగ్ ఆర్టెమియేవ్, డెనిస్ మాత్వివ్, సెర్గీ కోర్సకోవ్‌లు.. లుహాన్స్క్, దొనెట్స్క్‌ల జెండాలు పట్టుకుని దిగిన చిత్రాలను పంచుకుంది. 'లుహాన్స్క్ ప్రాంతవాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది' అని రోస్‌కాస్మోస్ పేర్కొంది.
మరింత ముందడుగేయండి: మరోవైపు ఉక్రెయిన్‌లో మాస్కో సేనల స్థితిగతులపై రష్యా అధినేత పుతిన్ సోమవారం రక్షణ మంత్రి సెర్గీ షోయిగును ఆరా తీశారు. యుద్ధభూమిలో మరింత ముందుకు సాగాలని ఆదేశించినట్లు సమాచారం. తూర్పు, పశ్చిమ బృందాలతోసహా మిలిటరీ యూనిట్లు గతంలో ఆమోదించిన ప్రణాళికల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. లుహాన్స్క్‌లో సాధించిన మాదిరిగానే.. ఇకముందూ విజయాలు ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు లుహాన్స్క్‌లో పోరాడిన రష్యన్ సైనికులు విశ్రాంతి తీసుకోవాలని, వారి పోరాట సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. తాజా విజయంతో డాన్‌బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న లక్ష్యానికి మరింత చేరువైనట్లు రష్యా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: రష్యా అధీనంలోకి మరో నగరం.. డాన్‌బాస్‌పై గురి!