ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మూనుయేల్ మేక్రాన్ సర్కారుకు ఆ దేశ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఫ్రాన్స్ పార్లమెంట్ అయిన నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడగా.. మేక్రాన్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. దీంతో ఫ్రాన్స్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. మేక్రాన్ కూటమి భారీగా స్థానాలను కోల్పోగా.. మితవాద పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అయితే సంపూర్ణ మెజారిటీ దక్కకపోయినా.. మిగతా పార్టీల కంటే.. మేక్రాన్ సారథ్యంలోని సెంట్రిస్ట్ కూటమి ఎక్కువ స్థానాలను దక్కించుకుంది.
ఫ్రాన్స్‌లో రెండో పార్లమెంట్ అయిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతివాద వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ నేతృత్వంలోని కూటమి 'న్యూప్స్' గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. సీఎన్ఎన్ ప్రకారం.. మొత్తం 577 స్థానాల్లో 245 సీట్లు మేక్రాన్ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కాయి. జాతీయ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ దక్కాలంటే.. 289 సీట్లు రావాల్సి ఉంది. జీన్ లూక్ మెలెన్‌చోన్ కూటమి.. 131 స్థానాల్లో విజయం సాధించి.. రెండో స్థానంలో నిలిచినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఫలితాలు చెబుతున్నాయి. మేక్రాన్ కూటమికి ప్రతికూల ఫలితాలపై మెలెన్‌చోన్ స్పందించారు. 'అహంకార ప్రభుత్వాన్ని గద్దె దించాలని అనుకున్న నెల రోజుల్లోనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాం' అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. మారీన్ లె పెన్ సారథ్యంలోని అతివాద పార్టీ అయిన సంప్రదాయవాద నేషనలిస్ట్ పార్టీ బలం కూడా పెరిగింది. ఈ ఎన్నికల్లో 89 స్థానాలను గెలుచుకుంది. 2000లో వచ్చిన ఎన్నికల సంస్కరణల తర్వాత.. దిగువ పార్లమెంట్లో మెజారిటీ సాధించని మొదటి సిట్టింగ్ అధ్యక్షుడిగా మేక్రాన్ చరిత్రలో నిలిచిపోనున్నారు.
ఇదీ చదవండి: నెలల తరబడి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. సైన్యంలో ధిక్కార స్వరం!